Thursday, September 8, 2016

నేను... ఒక సగటు ఆంధ్రుడిని


                                                                అసలు అరుణ్‌ జైట్లీ ఏం చెప్పారు...? బట్టీ పట్టిన పాత పాఠమే మళ్లీ చెప్పారు. కొత్తగా ఏం చెప్పారని. అంతకు ముందోసారి చెప్పిన పేపరు, నిన్నటి పేపరు పక్కన పెడితే... దాదాపుగా కాపీ, పేస్ట్‌ అనిపించింది అంతే. చిన్న మార్పులు.. అవి కూడా చెప్పుకోదగ్గవి ఏం కాదు. కానీ, మీడియా ఏం చేసింది? ఓ...లక్షన్నర కోట్ల బడ్జెట్‌ పరుగులు తీసుకుంటూ వచ్చేస్తోంది. హోదా ఏం ఖర్మ... దాని బాబు వస్తోంది... చంద్రబాబు తెచ్చేస్తున్నారని షిఫ్ట్ల వారిగా దంచేశారు. పొద్దున్న నుంచి అర్థరాత్రి వరకు ఇండియా పాకిస్థాన్‌ ఒన్‌డే మ్యాచ్‌ చూసినంత ఉత్కంఠగా టీవీల ముందు కూర్చున్నారు ఆంధ్రులు. ఏదే జరిగిపోతోంది.. ఏదేదో వచ్చేస్తోంది... ఆంధ్ర వెలిగిపోయేలా కేంద్రం నిధులు ఇచ్చేస్తోంది అని తెగ అశలు పెట్టేసుకున్నారు జనం. తీరా చూస్తే కనీసం రైల్వే జోన్‌ ప్రకటన కూడా లేకుండా ఉప్పు లేని పప్పు, తాలింపు లేని చారులా మహా చప్పగా నడిచింది వ్యవహారం. దీని కోసం రోజంతా ఎదురు చూసిందంతా టైం వేస్ట్‌ తప్ప ఇంకోటి కాదు. అయితే ఈ టైం వేస్ట్‌కి కారణం... మీడియా హడావుడే.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మభ్యపెడుతున్నది మీడియానే. ముఖ్యంగా చంద్రబాబు గారి ప్రాపకం కోసం పాకులాడుతున్న మీడియా ఆలోచన ధోరణి ఏ  దారిలో వెళ్తోందో అర్థం కాని పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్‌ అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు... సుమారు 5 కోట్ల మంది జనాభా... వారి కలలు. విభజన పాత కథ.. పాచి కథ కూడా. ఇప్పుడున్న కర్తవ్యం... ఆంధ్ర ప్రదేశ్‌ మనుగడ మాత్రమే. ఇదొక్కటే కొత్త కథ. ఆ కథ కాస్త క్లారిటీగా ఉండాలి. కానీ ఏం చేశారు... ఈ కథ ఎప్పటికీ అమరావతి చేరని విషాద గాధగా మార్చేశారు. హోదా అంటారు, కాసేపటికి హోదా కన్నా ప్యాకేజీనే బెటర్‌ అంటారు, మళ్లీ హోదానే మా నినాదం అంటారు... ఇందులో ప్రభుత్వానికి దేనిపై క్లారిటీ ఉంది...? ఢిల్లీకి కాదు... ఆంధ్రప్రదేశ్‌ గల్లీలకే ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ గల్లీల్లో జనం మాటకే వత్తాసు పలకాలి. ఆ జనం మదిలో ఏముందో అదే ఢిల్లీలో నిలదీసి అడగాలి. అడిగేస్తున్నాం.. కడిగేస్తున్నాం... అని మాటలు తప్ప... కొత్త రాష్ట్రానికి (అవును మరి ఆంధ్రప్రదేశే కొత్త రాష్ట్రం) దిశ, దశ లేవు. కనిపిస్తున్నదల్లా అమరావతి అన్న మాట, గుప్పెడు మట్టి అంతే. ఈ నిజాన్ని కప్పిపెట్టి కొన్ని ఛానళ్లు చేస్తున్న హడావిడి ప్రజలను మోసం చేయడమే. ఎంతో మంది హైదరాబాద్‌ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎర్పడ్డాక... సొంత గూటికి వెళ్లాలని ఎంతో మందికి ఆశ. కానీ... వెళ్లి అడిగి చూడండి... ఒక్కరి కళ్ళ్లల్లో కాన్ఫిడెన్స్‌ కనిపించదు. ఎందుకంటే.. ఆంద్రప్రదేశ్‌ ఎప్పటికి ఒక రూపు సంతరించుకుంటుందో తెలీదు. ఇదో బేతాళ ప్రశ్న. అసలు కేంద్రం మాటలకు కన్విన్స్‌ అవ్వాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకుందో అర్థం కాదు. అలాంటప్పుడు... హోదా రాదు.. అని జనాలను కన్విన్స్‌ చెయ్యాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. ప్రయత్నించాం... రాలేదు... అని చెప్పేస్తే... మానసికంగా జనం దానికి నెమ్మదిగా అయినా సిద్ధపడతారు. ఆ మాట చెప్పరు, జనం హోదా మీద ఆశ చంపుకోరు. ఎలా మరి...? ఎక్కడ దీనికి ఫుల్‌స్టాప్‌ పడాలి. మరోవైపు... ప్యాకేజ్‌ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్న మీడియా కథనాలు.  రోజుకో కొత్త కథ చెప్తే...జనాలు ఎలా అర్థం చేసుకోవాలి?  తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి  నెమ్మదిగా దారులు వేసుకుంటూ పోతుంటే... ఆంధ్రలో ఏం జరుగుతోందో  తెలియని పరిస్థితి.. ఏమైనా అంటే గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలను చూపించి అదే అభివృద్ధి అనే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. అదేదో పుష్కరాలు జరగడం ఇదే మొదటిసారి అన్నట్టు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు దిక్కమొక్కు లేని స్థితిలో ఉన్నాయి. రాయలసీమ అభివృద్ధి కనుచూపు మేరలో లేదు. కనీసం వారి కరవుకి మందేసే పరిస్థితి కనిపించడం లేదు. ఏమైనా అంటే అమరావతిని చూపిస్తున్నారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ జనాభా అంతా పట్టదు కదా..? ప్రపంచ దేశాల్లో కూడా రాజధానికి పెద్దగా ఇంపార్టెన్స్‌ ఏం ఉందడు. అమెరికా అనగానే న్యూయార్క్‌ గుర్తొస్తుంది గానీ... వాషింగ్టన్‌ ఠక్కున గుర్తుకు రాదు. ఆస్ట్రేలియా అంటే సిడ్నీ అని ఎవరైనా చెప్తారు. కాన్‌బెర్రా ఆ  దేశ రాజధాని అని ప్రత్యేకంగా చెప్పాలి. నా ఉద్దేశం... రాజధాని అడ్మనిస్ట్రేషన్‌ సెంటరే తప్ప... రాష్ట్రానికి అదే గుండె కాయ కాదు. ఆర్థిక వనరులు తెచ్చే ప్రాంతాలు రాష్ట్రానికి గుండె కాయలు. ప్రపంచ వ్యాప్తంగా కూడా అలాంటి నగరాలే స్వర్గాలుగా మారాయి. ఆ ప్రభుత్వాల దృష్టి ఆ నగరాల మీదే ఇప్పిటికీ ఉంది. ఆర్థిక నగరాలను వదిలేసి.... ప్రభుత్వం మొత్తం దృష్టి అమరావతి మీద మాత్రమే పెట్టడం  వెనుక ఏ లాజిక్కు లేదు. కేవలం రాజకీయం మాత్రమే ఉంది. ఇవేవీ పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్‌ మీడియా మిత్రులకు కనిపించక కాదు. వారిలో చాలా మందికి మనసులో ఉంది... వాస్తవాలు చెప్పాలని. కానీ, కంట్రోల్‌ వేరే చోట ఉంటుంది. వారేం చెయ్యలేరు. మొత్తానికి నా రాష్ట్రం కథ ఎటు పోతోంది... ఎక్కడకు చేరుతుంది... ఈ హోదాలు, ప్యాకేజీలు ఈ గోల కాదు... అసలేం చెయ్యబోతున్నారు... క్లారిటీ కావాలి. నా లాంటి ఎంతో మంది పౌరుల మదిలో నలిగిపోతున్న సమాధానం లేని ప్రశ్న ఇదే. ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం కాదు నా ఉద్దేశం. ఇదే కొనసాగితే మరో దశాబ్దం తర్వాత కూడా హోదా, ప్యాకేజీ గోలే వినిపిస్తుంది... దేశంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఆంధ్ర మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎంతో మంది నిరుద్యోగులు కలలు, ఎంతో మంది విద్యార్థుల చదువు ఆశలు, ఏదో జరిగిపోతుంది... స్వర్ణాంధ్ర వచ్చేస్తోంది అని మీడియాలో ప్రతి క్షణం కనిపించే కథనాలు హోరు చూసి ఏవేవో  ఆశలు పెట్టుకున్న పౌరులను దయచేసి నిరాశ పరచొద్దని సగటు ఆంధ్రుడిగా విన్నవించుకుంటున్న విన్నపమిది....








No comments:

Post a Comment