Friday, September 9, 2016

హీరో...






నిజంగా... పవన్‌ కళ్యాణే బెటర్‌. మీడియా ఆయన్ని ఎంత వెక్కిరిస్తే ఏం గాక, ఆయన్ని తిక్క అంటే అన్నారు గాక. ఈ మాత్రం మాటాడి ఆంధ్ర ప్రజల పక్షాన నిలిచి, వారి సెల్ఫ్‌ రెస్పెక్ట్‌కి గౌరవం ఇచ్చిన నేత ఎవరున్నారు చెప్పండి. అప్పుడు నాకు సరిగ్గా 9 ఏళ్లుంటాయి. ఓ పాతికేళ్ల క్రితం మాట. అప్పటికే మా మామయ్య ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాలోవర్‌. మీటింగ్‌లు అవి మా మామయ్య ఇంట్లో జరుగుతుండేవి. నేను ఆయన దగ్గరే ఉండి చదువుకునే వాడిని. సహజంగానే వారి మీటింగ్‌లు అవీ నేను ఆసక్తిగా వినేవాడిని. అలా నాకు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే అభిమానం. అప్పట్లో వెంకయ్య నాయుడు ఒక హీరో. ఎస్వీ రంగారావులాంటి విగ్రహం, జగ్గయ్యలాంటి వాచకం... భవిష్యత్తులో మన దేశం గర్వించే నాయకుడవుతాడ్రా.... అని మా మామయ్య అనేవారు. సహజంగా ఆయనంటే నాకు ఒక అభిమానం ఏర్పడింది. సీన్‌ కట్‌ చేస్తే.... గొప్ప నాయకుడైతే అయ్యారు. మా మామయ్య చెప్పిందైతే జరగలేదు. ఇక జరిగే అవకాశం కూడా లేదు. ఇప్పుడాయన్ని చూస్తుంటే జాలి కలుగుతోంది. అప్పటి వెంకయ్యకు, ఇప్పటి వెంకయ్యకు ఏ మాత్రం పొంతనే లేదు. ఆయన వేరు, ఈయన వేరు. ఎవరైనా కన్నతల్లికి అన్ని వసతులు కల్పించాలని అనుకుంటారు. కానీ, ఆయన పుట్టిన ఆంధ్రకు ఏమీ చెయ్యలేకపోయారు. కనీసం.. ఆయన రాజ్యసభలో ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేక పూర్తిగా ఓడిపోయారు. ఆ మాట కూడా జనానికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడాయనకు పదవి ముఖ్యం, హోదా ముఖ్యం, మోదీ ముఖ్యం... ఆంధ్ర ప్రదేశ్‌ మాత్రం ముఖ్యం కానే కాదు. పాపం ఏ మాటాడాలో తెలియక పంచెలో ఏముంది... పంచె కింద ఏముంది.. అనే లోక్లాస్‌ మాటలకు దిగిపోయారంటే.. ఏ మాటాడాలో తెలియకే...? ఆయనేసే జోకులకు ఆంధ్రులు నవ్వే పరిస్థితిల్లో లేరు. మరే చేద్దాం. జాలి పడదాం. ఎంతైనా సాటి ఆంధ్రుడు కదా. ఎలాగు మన ప్రభుత్వానికి, ప్రభుత్వం మాటకు కేంద్రంలో వీసమెత్తు విలువ లేదని అర్థమైపోయింది. మోదీ నిజమైన దేశ భక్తుడు. యస్‌... నిజం. అవసరమైతే మన రాష్ట్రానికి రావాల్సినవి ఆపైనా సరే... ఆయన మాతృభూమి గుజరాత్‌కే అన్ని వచ్చేలా.. చేసుకుంటారు. కనీసం ఆయన్నైనా ఆదర్శంగా తీసుకోవాలి కదా. పాపం... వాళ్లేం చెప్తే అది.. విని... పోన్లే ఈసారికి సర్దుకుపోదాం... అని... అరుణ్‌ జైట్లీకి పూలబొకేలు ఇచ్చి మరీ... మీరిచ్చిందే మహా భాగ్యం అని ఆయనకు క్యూలు కట్టి షేక్‌ హ్యాండ్‌లు ఇస్తున్న మన నాయకుడులను చూసి ఏం చేస్తాం జాలి పడడం మినహా. అందుకే వాళ్లందరి కన్నా పవన్‌ కళ్యాణ్‌ గొప్పవాడు. కనీసం నిలదీశాడు. జనం మాట మాట్లాడాడు. పదాల పడికట్టు తెలియకపోతేనేం, అక్కడక్కడ చిన్న తప్పులు వస్తేనేం, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకపోతేనేం.... సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు. పడికట్టు పదాలతో జనాలను మభ్యపెట్టడానికి ఇంకా ఆయనకు వయసు సరిపోదు. (రాజకీయాల్లో). ఇంకా ఆయన రాజకీయ పరిణామ క్రమంలో ఇంకా తొలి దశలోనే ఉన్నాడు మరి.

No comments:

Post a Comment